తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయం ముందు త్వరలో ప్రారంభించబోయే రాజీవ్ గాంధీ విగ్రహం 2029 లో అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని తొలగిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెదిరించడంతో పెద్ద రాజకీయ దుమారం రేగింది.
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ తొలగిస్తుందని, విగ్రహాన్ని ఏర్పాటు చేసిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిందని కేటీఆర్ సోమవారం చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాకమని బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన కేటీఆర్, కేసీఆర్‌లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని కోల్పోయారని, కానీ వారి అహంకారం పోలేదని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాదని ఆయన అన్నారు. రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని సమర్థిస్తూ, రాబోయే 15-20 రోజుల్లో విగ్రహాన్ని భారీ కార్యక్రమంలో ఆవిష్కరిస్తామని ప్రకటించారు.
10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆయన ప్రకటించారు.