Sun. Sep 21st, 2025

పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, కనీసం 25 మంది గాయపడ్డారు. న్యూ జల్‌పైగురి స్టేషన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిలిగురిలోని రంగపాణి ప్రాంతంలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది.

ఢీకొనడంతో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. 13174 కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ అగర్తల నుండి కోల్‌కతాలోని సీల్దాకు వెళుతోంది. ఢీకొనడంతో గూడ్స్ రైలు పూర్తిగా కుప్పకూలింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన బోగీల్లో ఒకటి ఆ ప్రభావంతో గాల్లోకి లేచింది.

ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఉత్తర సరిహద్దు రైల్వే యొక్క కతిహార్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్ఎం) తెలిపారు. గూడ్స్ రైలు రెడ్ సిగ్నల్ జంప్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రైల్వే పోలీసులు, రెస్క్యూ విభాగం సహాయక చర్యలు చేపడుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సంఘటనపై స్పందిస్తూ, “డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతంలో జరిగిన విషాదకరమైన రైలు ప్రమాదం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను” అని ట్వీట్ చేశారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. “ఎన్ఎఫ్ఆర్ జోన్‌లో దురదృష్టకరమైన ప్రమాదం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వేలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సమన్వయంతో పనిచేస్తున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు “అని ట్వీట్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *